హాజరయ్యేముందు...
చక్కగా చదివి పరీక్షకు సంసిద్ధులయ్యారా అంతా! ఇక దానిని ఎదుర్కోబోయే ముందు కొన్ని సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. అయితే ఇవీన్న తేలిగ్గా పరిష్కరించుకోగలిగినవే. సమస్యలను భూ తద్దంలో చూస్తేనే ఇబ్బంది!
* 'పరీక్షలకు వెళుతున్నాం' అనే భావన పదే పదే మనస్సులో సుడులు తిరిగి ఆందోళనను పెంచుతుంది. ఈ ఆందోళన అన్ని సమస్యలకు మూలకారణం. కావున ఆందోళన తగ్గించుకునేందుకు శ్వాస నియంత్రణ చేసుకోవాలి. శ్వాసను గమనిస్తూ గాలిని మెల్లగా పీల్చి వదులుతూ ఉంటే అనవసరపు ఆందోళన మాయమవుతుంది. అలాగే పరీక్షను ధీటుగా ఎదుర్కొనేందుకు సానుకూల దృక్పథాన్ని ప్రోదిచేసుకోవాలి. దీని కొరకు... ధీమాగా పరీక్షకు వెళ్ళినట్లు, చదివిన ప్రశ్నలే వచ్చి వాటిని చక్కగా రాసి సంతోషంగా పరీక్షాకేంద్రం నుంచి బయటకు వచ్చినట్లు ఊహించుకోవాలి. ఇది మనలోని భయాన్ని సుళువుగా తీసివేస్తుంది.
* పరీక్షకు కూర్చున్నాక అవసరమైన సామాగ్రి కొరకు వెతుకులాడడం విజ్ఞత అనిపించుకోదు. వాటికొరకు ఇతరులను అడగడం మనలో విశ్వాసాన్ని తగ్గించే చర్య. కావున వెళ్ళబోయేముందే చక్కగా రాసే రెండు పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్... లాంటివి సిద్ధం చేసుకోవాలి. హాల్‌టిక్కెట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పరీక్షా కేంద్రాలన్నింటిలోనూ బల్లలు (డెస్క్) ఉంటాయని భ్రమపడొద్దు. పైన చెప్పుకున్న వాటితో పాటు ఒక ప్యాడ్ (అట్ట) తీసికెళ్ళడం మరవద్దు. వాటర్ బాటిల్ ఒకటి మీ వెంట ఉంచుకోవడం చాలా అవసరం. వేసవికాలం కూడా కదా!
* ఎమ్‌సెట్, ఎడ్‌సెట్, ఐసెట్.. లాంటి పరీక్షల ప్రభావంతో పది, ఇంటర్ పరీక్షల నిర్వాహకులు కూడా ఏమాత్రం ఆలస్యాన్ని సహించడం లేదు. ఐదునిముషాల ఆలస్యంతో పరీక్షను పోగొట్టుకోవడం విజ్ఞత అనిపించుకోదు. ఒక గంట ముందే ఇంటివద్ద నుంచి బయలుదేరడం ఉత్తమం. ట్రాఫిక్ సమస్యలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి.
* గత సంవత్సరం మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలొచ్చిన పరీక్షాకేంద్రాల్లోనే మీరూ పరీక్ష రాయాల్సి వస్తే వాటిపట్ల తేలికభావం, కాపీలు జరుగుతాయన్న భ్రమలు పెట్టుకోకండి. ఈ సంవత్సరం ఆ కేంద్రంపై అధికారులు నిఘా ఉంచి పరీక్షలు జరిపించొచ్చు. అసలు కాపీలపై ఆధారపడడమంత మూర్ఖత్వం మరొకటుండదు. స్వశక్తిపై పూర్తి విశ్వాసముంచండి. అదే మీకు విజయాన్ని అందిస్తుంది.
* ఇక పరీక్షకు వెళ్ళబోయేముందు కొందరు శకునాలు చూస్తారు. ఇదెంత మూఢనమ్మకమో, అసంబద్ధమో కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. 100 మీ. పరుగుపందెంలోని క్రీడాకారుడు శకునం చూసుకుని ఒక సెకన్ ఆలస్యం చేస్తే?... ఇలా ప్రతి పనికి శకునం చూడాలనే నియమం పెట్టుకుంటే మనం ఏపనీ సాధించలేము. తల్లిదండ్రులు అలా ప్రవర్తిస్తే మీరు వారికి తార్కికంగా ఆలోచించమనాలేగాని, మీరే మూఢనమ్మకాల ఊబిలో దిగరాదు.
* కొంతమంది పరీక్షా కేంద్రానికి పుస్తకాలు తీసికెళ్ళి పరీక్ష ప్రారంభానికి ఒక నిమిషం ముందు కూడా హడావుడిగా చదివేస్తుంటారు. ఇది మెదడును చికాకు పరిచే ప్రక్రియ. ఇలాంటి స్థితిలో మెదడు తన పొరల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని పేర్చుకునేందుకు తగిన సమయం, అవసరమైన వాటిని వెతికి తీసే సంసిద్ధత తగ్గుతాయి. ఒక అర్ధగంట ముందునుంచే ఏమీ చదవకుండా ప్రశాంతంగా ఉండి పరీక్షకు హాజరుకావడం సానుకూల ఫలితాలనిస్తుంది.
రాసేటప్పుడు...
* ముందుగా.. తెలిసిన చిన్న ప్రశ్నలకు, తర్వాత తెలిసిన పెద్ద ప్రశ్నలకు జవాబులు రాయండి. దాంతో మన విశ్వాసస్థాయి పెరిగి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా జవాబులు రాసేందుకు సిద్ధపడతాము. సమయం మిగిలితే అరకొరగా తెలిసి ఛాయిస్‌లో వదిలేసిన వాటిని కూడా శక్తిమేరా రాయడం వల్ల అదనంగా కొన్ని మార్కులు వచ్చేందుకు ఆస్కారమేర్పడుతుంది.
* గ్రూపు సబ్జెక్టుల కంటే లాంగ్వేజెస్ (తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృతం....మొదలైనవి)లో గుండ్రటి చేతిరాత (దసూర్తి) మార్కుల్ని పొందటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. సాధన ద్వారా లభించే చక్కటి చేతిరాతను అందరూ కలిగి ఉండకపోవచ్చు. అంతమాత్రాన డీలా పడాల్సిన పనేంలేదు. కాస్త సమయం అధికంగా తీసుకుని రాయగలిగినంత చక్కగా రాస్తే చాలు. నిదానంగా రాస్తే సమయం సరిపోదనుకోకండి. వ్యాసరూప సమాధానాల్లో స్వల్ప అంశాలు మినహాయించుకోవడం వల్ల సమయాన్ని కలుపుకోవచ్చు. దస్తూరితో మనం పోగొట్టుకునే మార్కులతో పోలిస్తే ఇలా పోయేవి స్వల్పం.
* ఇక పరీక్ష రాసి వచ్చేటప్పుడు మిగతా విద్యార్థుల మాటలకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ తాము రాసేశామని 90 శాతం మార్కులు తథ్యమని కొందరు డాంబికాలు చెబుతుంటారు. ఆ మాటల్ని విని ఆత్మనూన్యతకు గురైతే దాని ప్రభావం ఇతర పరీక్షలపై ఉంటుంది. కావున పరీక్షలు అయిపోయేంతవరకూ ఎవరి మాటల్నీ పట్టించుకోకండి. ఒక పరీక్ష సరిగా రాయకుంటే దాని గురించి వెంటనే మర్చిపోవాలి. దానినే జ్ఞప్తికి చేసుకుంటూ ఉంటే మిగతా పరీక్షలేవీ సరిగా రాయలేము. పదవతరగతి విద్యార్థులైతే ఒక పేపర్ సరిగా రాయలేదని అసలు బెంగ పెట్టుకోవద్దు. ఎందుకంటే హిందీ తప్ప మిగిలిన వాటన్నింటికి రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి సరిగా రాయకున్నా రెండవది మనల్ని ఆదుకోవచ్చు. అలాగే రెండింటిలో ఒకటి చాలా కష్టంగా ఇస్తే రెండవది సులువుగా వచ్చే అవకాశాలు అధికం. అసలు ఏ ప్రశ్నాపత్రామైనా సులభ, మధ్యస్థాయి, క్లిష్టమైన ప్రశ్నలతో కూడి ఉంటుంది (బ్లూ ప్రింట్ ప్రకారం). ప్రశ్నాపత్రం మొత్తం ఇనుపగుగ్గిళ్ళలాగా ఉండదు.
చివరగా ఒక్కమాట.. విజయమైనా, పరాజయమైనా ఒకేవిధంగా స్వీకరించండి. ఒకసారి పరాజయం ఎదురైతే అది మళ్ళీ మనవైపు కన్నెత్తి కూడా చూడకుండా మనం కష్టించి విజయాన్ని స్వంతం చేసుకోవాలి. భయంతో, భవిష్యత్‌పై బెంగతో జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రయత్నించేవారు. సుదూరంగా పారిపోయి సమస్యలను తప్పించుకున్నామని సంబరపడేవాళ్ళు పిరికివాళ్ళు. సమస్యలు లేని మనిషి భూమిపై లేడు. అలాగే పరిష్కారం లేని సమస్యలు కూడా లేవు. ఈ పరీక్షలు భవిష్యత్ జీవితంలో మనం ఎదుర్కోబోయే ఎన్నో సమస్యలకంటే అత్యంత తేలికైనవనే విషయాన్ని మరవకండి.