Labels

ss

జీవన స్రవంతి - టి.రెహతాజ్ బేగం


కళ్ళు మూసుకుని నా నెంబర్ ఎప్పుడొస్తుందోనని ఎదురుచూస్తూ కూర్చున్నానే్నను. ఎవర్నైనా పలకరిద్దామంటే తెలిసిన వారెవ్వరూ కన్పిచ్చలేదు. లేచి అటూయిటూ పచార్లు చేసా. ఆకురాలు కాలపు తేమ లేని గాలి నా మొహంకేసి కొట్టిపోయింది. శ్వాస ఎగదన్నుకొస్తున్నట్టన్పిచ్చింది కాసేపు. ఆ రోజు పేషెంట్స్ కాస్త తక్కువగానే వున్నట్టున్నారు. తోడొచ్చిన వారితో మాట్లాడుకుంటున్నారు కొంతమంది. ...ఒకరిద్దరు అక్కడేవున్న మెడికల్ షాప్‌లో మందులు కొంటున్నారు. ఓ పల్లెటూరతను చెప్పులేసుకుని లోపలికొచ్చాడని కంపౌండర్ కేకలేస్తున్నాడు. మూలనున్న మనీ ప్లాంట్ పక్క ఛైర్‌లో వచ్చి కూర్చుని కళ్ళు మూసుకున్నా.
‘అక్కడి వాతావరణానికి తగ్గట్టు వుంది ఫీజు. మరి ఖరీదుకి తగ్గ వైద్యం కూడా చేస్తారో? చేస్తూనే వుండాలి మరి.’
లోపలికెళ్ళాక డాక్టర్ సమస్యేవిటని అడిగితే ఏం చెప్పాలి? సమస్య... సమస్య... స్పష్టమైన పేరు లేదే నా దగ్గర. ఆవిడిచ్చే పది నిమిషాల్లో ఏమని చెప్పాలి? నా ఆలోచనలు సాగిపోతున్నాయ్.
డాక్టర్ కాబిన్ ముందు నించున్న నర్స్ అప్పటికే ఓసారి పిల్చింది కాబోలు, దగ్గరికొచ్చి ఛేర్‌పై కొట్టింది. నే పరధ్యానంగా వుండటం చూసి, ‘నెక్స్ట్ మీ నెంబరే’అంది.
లోపలికెళ్ళాక ఎ.సి. గది చాలా చల్లగా ప్రశాంతంగా అన్పిచ్చింది. పరిచయం చేసుకున్నా. ‘చెప్పండి. ఏమైంది?’ అడిగింది నేరుగా విషయంలోకొస్తూ. చేతిలో పెన్ ఆడుతోంది.
నాకు ఎక్కడ్నించి మొదలుపెట్టాలో అర్ధంకాలేదు. ‘అది...ప్రాబ్లం అంటే ఎగ్జాక్ట్‌లీ యిదని కాదు... కానీ ఎందుకో ఈమధ్య నాకు ఊపిరి సరిగ్గా ఆడనట్టు అన్పిస్తుంది. నిద్రపట్టట్లేదు. నిజం చెప్పాలంటే నిద్రపోక, చాలా కాలమైనట్టు అన్పిస్తుంది. విపరీతంగా కలలు...’
ఆమె రియాక్షన్‌కై నేనాగటం చూసి అంది ‘రిలాక్ట్ పూర్తిగా చెప్పండి మీరు.’
‘...మునపట్లా, ఏ పనీ సరిగ్గా చేయలేకపోతున్నా. ఆకలుండదు, బద్దకం. నాకు సంబంధం లేని ఆలోచనలు. నాకు మైండ్ చాలా అలసిపోయినట్టుంటుంది డాక్టర్.’ వీటన్నిటికంటే ముఖ్యమైంది గొంతుకేదో అడ్డం పడ్డట్టు, శ్వాస ఎగదన్నుకొస్తున్నట్టు వుంటుంది.’
నేను చాలా యాంగ్జైటీతో చెప్తున్నట్టన్పించింది కాబోలు నావైపు చూస్తూ ‘అలా ఎప్పుడన్పిస్తుంది’ అడిగింది.
‘ఎప్పుడైనా...రోజంతా... ఒక్కోసారి పగలు, ఒక్కోసారి నిద్రపోతున్నా కూడా!’
డాక్టర్ స్టెత్ చెవిలో పెట్టుకుంటూ, చేత్తో సైగ చేసింది, వచ్చి తన పక్క స్టూల్‌పై కూర్చోమన్నట్టు. హార్ట్‌బీట్, పల్స్ రేట్, యింకొన్ని చెక్ చేసాక, ‘్భయపడాల్సిందేమీ లేదు. ఎవిరిథింగ్ రుూజ్ నార్మల్’ అంది. ఏవో మందులు రాసి స్లిప్ నా చేతికిచ్చింది. వారం తర్వాత మళ్ళీ రమ్మంది.
నాకేవిటో సంతృప్తిగా అన్పిచ్చకపోయినా, అప్పటికి సరిపెట్టుకోవాల్సొచ్చింది.
* * *
నేనింటికి వచ్చేలోపే పిల్లలిద్దరూ స్కూల్‌నుంచి వచ్చేసారు. శ్రీ్ధర్ యింకో నాలుగు రోజులక్కానీ కాంప్‌నుంచి రారు. పిల్లలకి టిఫిన్ పెట్టా. నాకేమీ తినాలన్పిచ్చలేదు. వచ్చేప్పుడు మెడికల్ షాప్‌లోంచి తెచ్చుకున్న మందులు, నాలుగు రకాలు, రోజుకి గుప్పెడు మందులు తినాలి. వాటిని చూస్తుంటే జబ్బు యింకా ఎక్కువైనట్టన్పిచ్చింది.
‘అమ్మా అన్ని టాబ్లెట్స్ ఎందుకు? జరమొచ్చిందా నీకు?’ డింకీ సందేహం.
‘అబ్బే లేదమ్మా!’
‘లేదు. ఏదో అయ్యింది కదా!’ వంశీ అడుగుతున్నాడు.
హోంవర్కు వదిలేసి, దగ్గరగా వచ్చి, కంగారుగా అడుగుతున్న పిల్లల్ని చూసి ఎలాగో అన్పిచ్చింది నాకు. కాసేపటికెలాగో టీ.వీ. లోకంలో పడిపోయారు.
అర్ధరాత్రి దాటుతున్నా నిద్రపట్టలేదు. అద్దంలో నా ప్రతిబింబం, నీరసంగా...నల్లటి వలయాల కళ్ళలో. డాక్టర్ చెప్పింది గుర్తొచ్చింది ‘మీకు సంతృప్తినీ, ఆహ్లాదాన్నీ కల్గించే వాతావరణంలో వుండండీ’ అని. నిర్వచనం వెదకటంలో మునిగిపోయా. ‘అన్నీ వున్నా ఈ కోల్పోయిన భావవేమిటి? అన్నిటికీ ఆవల యింకా ఏముంది?’
శ్రీ్ధర్ కాంప్ నుండొచ్చాక డాక్టర్ చెప్పింది చెప్పా. ‘అయితే డాక్టర్‌గారు చెప్పింది తు.చ. తప్పక పాఠించు. నిజంగా నీకేజబ్బూ లేదు. అంతా నీ భ్రమ అరూ! అనవసరంగా ఏదేదో ఆలోచించకు’ అంటూ ముగించారు.
ఫ్రెండ్ సలహా యిచ్చింది నాల్రోజులు ఎటైనా తిరిగి రండని. యిప్పుడది కుదరదు. పత్రికల్లో సూచనలు చదివి యింటిని కొత్తగా అలంకరించా, షాపింగ్ చేసా, వాకింగ్‌కీ వెళ్ళాను. యింకా చేయాల్సిందేదో అసంపూర్ణంగా మిగిలిపోయినట్టన్పిస్తుంది.
* * *
ఈసారి డాక్టర్‌ని కలిసినపుడు, మరింత ఓపిగ్గా వింది. మెడిసిన్‌వల్ల మార్పేమైనా వచ్చిందా అని అడిగింది. ఔనూ... కాదూల మధ్య వుంది నా సంజ్ఞ. మళ్ళీ కొత్త మందులు. డాక్టర్స్‌ని నాలాంటివాళ్ళు రోజూ పదుల సంఖ్యలో కలుస్తుంటారు. వాళ్ళకివన్నీ కేవలం కేస్‌లు మాత్రమే, కాబట్టి డాక్టర్ మొహంలో ప్రతిస్పందనలు గమనించలేదు నేను.
రోజులు నిర్జీవంగా దొర్లిపోతున్నాయి. ఇల్లు, వంటలు, పిల్లలు, శ్రీ్ధర్ కాంప్ వగైరా, వగైరా...
డాక్టర్‌ని కలవటం అని మూడోసారి.
ఆవిడ నా మొహంలో అప్రసన్నత గుర్తించి, యింకా కొన్ని టెస్ట్‌లు సజెస్ట్ చేసింది.
మందులు మార్చేముందు నా దినచర్య చెప్పమంది. ‘ఏముందని లేవటం... కాఫీ టిఫిన్లు... వంట... కారియర్‌లు సర్దటం... టీవీ... నిద్ర... సాయంత్రం పిల్లలొచ్చాక వాళ్ళ హోంవర్క్‌లు మళ్ళీ తిండీ నిద్రా సందర్భాన్నిబట్టి అప్పుడప్పుడూ మార్కెట్, షాపింగ్, బంధువులూ...’ చెప్పాను.
శ్రీ్ధర్ గురించి కూడా అడిగాక, రిపోర్ట్స్ తర్వాత కలెక్ట్ చేసుకోండని చెప్పింది.
* * *
బాగా రాత్రయ్యింది. పిల్లలు భోంచేసి పడుకున్నారు. కళ్ళు మూసుకుంటే రెణ్ణెల్లనుంచి జరిగింది సిన్మారీల్‌లా కళ్ళల్లో మెదులుతోంది.
తలుపు చప్పుడైతే వెళ్ళి తీసా. శ్రీ్ధర్ రిపోర్ట్స్‌తోబాటు. యిద్దరం భోంచేస్తున్నామన్న మాటేగానీ, శ్రీ్ధర్ మొహంలో బాధా వీచిక, రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా వుంటే మరి ఈ వౌనం వెనక కారణం ఏవిటి?
ఉండబట్టలేక అడిగా,
‘నువ్వేమీ టెన్షన్ పడనంటే చెప్తా అరూ’! అన్నారు.
‘చెప్పకపోతేనే టెన్షన్. ఏవైందో చెప్పండి!’
‘...నా జాబ్...’
‘పోయిందా?’
‘అంటే పూర్తిగా పోలేదు. కొన్నాళ్ళవరకు తప్పనిసరిగా లీవ్‌లోనే వుండాలి.’
‘...’
‘ఆర్థిక మాంద్యం ప్రభావం అరూ.!’ ‘అలాఅని
అంతగా భయపడాల్సిందేమీ లేదు. మరో జాబ్‌కోసం ట్రై చేస్తున్నా. కొంత కాలానికి పరిస్థితులు చక్కబడతాయ్, అప్పుడు కావాలంటే యిదే ఉద్యోగంలో కంటిన్యూ కావొచ్చు.’
‘మరి అప్పటిదాకా?’
‘బాంక్ సేవింగ్స్ వున్నాయిగా. పనికొస్తాయ్’ అంటూ వాష్ బేసిన్ వైపు వెళ్ళారు.
‘...’ అయోమయంగా అన్పిచ్చింది.
* * *
శ్రీ్ధర్ పైకేవీ అనలేదు కానీ... వున్నట్టుండి వచ్చే జీతం ఆగిపోవటంతో యిబ్బందిగానే వుంది. శ్రీ్ధర్‌కు వుద్యోగం దొరికేవరకు నేనూ ఎక్కడైనా ప్రయత్నిస్తే బావుంటుందన్పిచ్చింది. నా బీ...ఈడీ గుర్తొచ్చి ఏ స్కూల్లోనో ఓ టీచరుద్యోగం దొరక్కమానదని నా నమ్మకం.
అంతలోనే నీరసం ముంచుకొచ్చింది, యిప్పుడు నాకున్న ఈ శతకోటి సమస్యలకు మరో బోడి సమస్య తోడైనందుకు.
న్యూస్ పేపర్‌లో కేబుల్ టీవీలో ప్రకటనలు చూసి ఓ రెండు స్కూల్స్‌కి అప్లై చేసా. ఓరోజు రెండు యింటర్వ్యూలకు వెళ్ళొచ్చేసరికి ఒళ్ళు హూనమయ్యింది. నాలుగురోజుల్లో ఫోన్‌చేసి చెప్తామన్నారు.
ఉస్సూరుమంటూ యింటికొచ్చి, కాళ్ళు లాగేస్తుంటే వేణ్ణీళ్ళ టబ్‌లో పెట్టుక్కూర్చున్నా.
గేటు ధబాల్నతోస్తూ వచ్చిందామె. అదే లయ లేని, ఉత్సాహమైన అరుపు. పండ్లమ్మే దానమ్మ. ఓరోజు ఆమె దగ్గర పండ్లు కొన్నప్పట్నించీ అలవాటుగా రోజూ వస్తుంది. అప్పుడప్పుడూ విసిగిస్తుంది కూడాను.
‘దానిమ్మలు బాగున్నాయ్. తీస్కుందామా!’
‘నాకు వెళ్ళే ఓపిక కూడా లేదు. వద్దన్నా.’
వినట్లేదు. ఒకటే నస. ఆమె తీసుకోమనటం...నేను వద్దనటం. ఓ పావుగంటపాటు ఆ సంభాషణ అలాగే సాగింది.
ఎంత విసుక్కున్నా కదలదాయె. యిహ ఓపిక నశించి, కాళ్ళుంచుకున్న నీళ్ళ టబ్బుని ఒక్క తన్ను తన్ని, బైటికెళ్ళి చెడామడా తిట్టేసా. ‘జ్ఞానం లేకుండా ఏవిటా అరుపులు, చెప్పింది నీక్కాదా! కేకలేసేదాకా ఒదలవేమిటి నువ్వు. యిప్పుడవి కొని, తినకపోతే కొంపలేవైనా అంటుకుపోతాయా? కొనేవాళ్ళెవరూ దొరకలేదా, నా ప్రాణం తింటున్నావ్. అంతగా బరువయ్యుంటే వెళ్ళు... తీస్కెళ్ళి ఏ చెత్తబుట్టలోనో గుమ్మరించు. వెళ్ళు. అర్థంపర్థం లేకుండా తిట్టేసా. అంతః స్వరం వారిస్తున్నా.
ఆమె మొహం చిన్నబోయింది. కానీ సహనం మాత్రం కాదు. కాస్తాగి ననే్న చూస్తూ, చిన్నగా చెప్పింది.
‘యింటికాడ పిల్లలు ఎదురుచూస్తుంటారమ్మా. యింక యినే్న మిగిలినాయి. యియ్యి అయిపోతే, యింటికి కొంచం తొందరగబోతా. బస్సుకి టైమైంది.’
మూగబోయానే్నను. అవసరం ఎంత సహనాన్నైనా యిస్తుంది. మనసు గదిలో నక్కిన అశాంతిని ఈ అశక్తురాలిపై గుమ్మరించినందుకు సిగ్గుపడ్డానే్నను.
కొన్నాళ్ళకు మా ఊరికి పక్కనున్న పల్లెలో ఓ ఛారిటీ ఆర్గనైజేషన్‌వారు స్థాపించిన స్కూల్‌లో నాకు ఉద్యోగం వచ్చింది. బస్‌లో వెళ్ళటం కాస్త కష్టమైనా, పరిస్థితుల ప్రభావంవల్ల తప్పలేదు మరి. మొదట్లో బెంగపడ్డా... క్రమంగా ఉత్సాహం, హడావిడి ఎంతోఅంత బయల్దేరింది నాలో. ఉదయం కళ్ళు తెరిచిందగ్గర్నించీ, రాత్రి రెప్పవాల్చేవరకూ, ఊపిరి సలపనంత పని, యిక శ్వాస రాకపోకలపై ధ్యాసెక్కడుంటుంది.
స్కూల్‌నుండి యింటికొచ్చేటప్పుడు, ఓ సాయంత్రం బస్‌స్టాప్‌లో కన్పిచ్చింది దానమ్మ. నేను పోల్చుకున్నా కానీ, ఆమె నన్ను గుర్తుపట్టినట్టు లేదు. ‘ఆ సంఘటన’ జరిగాక ఆమె మళ్ళీ నాకు కన్పిచ్చలేదు. నా గిల్టీ ఫీలింగ్ పోగొట్టుకోడానికి నేనే వెళ్ళి పలకరించా.
గుర్తుపట్టింది ‘ఈయాలప్పుడు రుూడున్నావేందమ్మా’? అంది, అదే నవ్వు దానిమ్మగింజల్ని అందంగా పేర్చినట్టు... చెప్పాను.
నాతోబాటే బస్సెక్కింది. మా ఊరి మార్కెట్ యార్డ్‌లో ఏదో పనుందని. నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే వుంది.
అలా అప్పుడప్పుడూ కన్పిచ్చేది బస్‌స్టాప్ దగ్గర... కాయగూరల బస్తాలతోపాటు. బస్‌లో నా సీట్ పక్కన కింద కూర్చుని కబుర్లు చెప్పేది. ఆ కబుర్లు నాకెంతో నచ్చాయి. వ్యవసాయం గురించి చెప్పేది... పొలం పనులని కళ్ళకు కట్టినట్టు చూపించేది. వాళ్ళకున్న కాస్త పొలంలో కూరగాయలు పండిస్తారనీ... పనులవీ లేనప్పుడు పండ్లమ్మేందుకు వస్తుందనీ తెల్సింది. ఎప్పుడూ రెండు దోర పళ్ళు చేతిలో పెట్టేది, తినమని, డబ్బిస్తే తీసుకునేది కాదు.
* * *
రోజులు దొర్లుతున్నాయ్. అనారోగ్యం అన్న మాటే మరిచాను. కారణం వెంట నడక, నూతనోత్తేజాన్ని యిచ్చింది.
కొన్ని రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ముగిసాక స్కూల్‌కి సెలవులిస్తారు. ఓ రోజు నేను స్కూల్‌నుంచి తిరిగొచ్చేటప్పటికి శ్రీ్ధర్ మామూలుగా ఆఫీస్‌కి సంబంధించిన ఫైల్స్ చెక్ చేసుకుంటున్నారు! నేను రావటం గమనించినట్టు లేదు. నా బుర్రకు అనుమానం రాలేదిన్ని రోజులు కానీ, శ్రీ్ధర్ చెప్పినట్టు ఆయనకు ఉద్యోగమేమీ పోలేదు. కేంప్‌కి మాత్రం వెళ్ళట్లేదు.
‘అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?’ కాస్త గట్టిగానే అడిగాను.
‘...’ తల తిప్పి చూసారు.
‘అదే జాబ్ పోయిందనీ, యింకోటి వెదుక్కోవాలనీ... నువ్వు కూడా ఉద్యోగంచేస్తే, కలిసొస్తుందని చెప్పుంటే పోయేదిగా. ఎందుకిదంతా?’
‘నిన్నిలా చూసేందుకు.’
‘...అంటే.’
‘అంటే... కొనే్నళ్ళ కిందటి అరుణను నిద్ర లేపేందుకు. ఆరోజు రిపోర్ట్స్ కోసం వెళ్ళినపుడు డాక్టర్ ఏమని చెప్పారో తెలుసా! ... ‘‘మీ వైఫ్‌కి ఆక్చువల్‌గా ఏ ప్రాబ్లం లేదు. కేవలం కాలంను అలా స్తబ్దంగా గడిపేస్తున్నందువల్ల ఆమెలో అసంతృప్తి పెరిగిపోయింది.
ఆ డిస్టర్బెన్స్‌లోంచి తనపై తనకు ఏకాగ్రత ఎక్కువైపోయింది. ఏదో జబ్బు పడ్డట్టు సైకలాజికల్ ఫీలింగ్‌లో వున్నారు. తనకంటూ ఓ మంచి వ్యాపకం ఏర్పరచుకుంటే... అందులో సంతోషాన్ని పొందగల్గితే... సంతృప్తితో మామూలుగా వుంటారు’’అని చెప్పారు, అందుకే అరూ! చిన్న ఐడియా ప్రయోగించా.
శ్రీ్ధర్ శ్రీ్ధరే. ‘నేనే తనకు అంతా’అని నాకు మరోమారు రుజువయ్యింది.
నాకు మరో విషయమూ తెల్సింది అదే లైఫ్‌ని ఎక్స్‌పాండ్ చేస్తూ పోవాలి. దేనికో ఓ దానికి మన అవసరం వుందన్న ఫీలింగ్ బ్రతకడానికి ప్రేరకానిస్తుంది. ఔనూ యిక యిలాగే ప్రవహిస్తూ పోవాలి.
గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నా.
* * *
ఆరోజు స్కూల్‌లో చివరి రోజు.
చాలా రోజుల్నించి దానమ్మ కన్పిచ్చట్లేదు. మళ్ళీ చాలారోజుల దాకా యిటువైపు రాను నేను. అందుకే ఆమెతోపాటు ఎప్పుడూ కన్పిచ్చే ఒకామెను అడిగితే చెప్పింది, ఈమధ్యనే దానమ్మ భర్త పోయినట్టూ, పనులు లేక యింట్లోనే ఖాళీగా వుంటోందనీనూ.
స్టాప్‌కు దగ్గర్లోనే యిల్లున్నట్టు తెల్సింది. అడుగుల్ని ఆపలేకపోయా. ఆమె నాకు చుట్టం కాదు. పక్కింటావిడో, స్నేహితురాలో కాదు. కనీసం ఆమె గురించి పూర్తి వివరాలు కూడా తెలీవు నాకు. నా ప్రవాహం గుర్తుచేసింది. ‘సంబంధం లేనివారిపై కోపాన్ని ప్రదర్శించగల్గినపుడు, వాళ్ళను కష్టాల్లో ఓదార్చేందుకు రీజన్స్ వెదకటం ఎందుకని.’
వీధి చివర్న ఓ చిన్న యిల్లు వుంది. బైట నులకమంచంపై పడున్న ముసలామెను అడుగుతుంటే లోపల్నుంచొచ్చింది దానమ్మ. అదే నవ్వు, కానీ జీవం లేదు. నన్నక్కడ చూసి చాలా ఆశ్చర్యపడింది. పరామర్శించేందుకు వచ్చానని అర్థమైంది ఆమెకు. నిజానికి ఆమె పరిస్థితికి ఏదైనా సహాయం చేయాలని వచ్చానే్నను.
ఆమె నేల వైపు చూస్తూ కూర్చుంది.
‘పిల్లలేరీ?’ అడిగాను. చేత్తో చూపించింది. ఆ ముసలామె వైపూ (ఆమె దానమ్మ భర్త తల్లిట) యింటి బైట ఆడుకుంటున్న పిల్లాడివైపూ. ‘ఆలోచించే తీరు మలుస్తుంది వ్యక్తిత్వాన్ని’ ఒకప్పుడు విన్నది గుర్తొచ్చింది.
ఘనీభవించినట్టు, వౌనంగా వుంది దానమ్మ. అలాంటి స్థితి యివ్వగల్గింది అదే. జీవన స్రవంతిలో పడేందుకు అందులోంచి బైటికి రాక తప్పదు. ఎందుకంటే ఎప్పుడూ అంతా ముగిసిపోదు.
డబ్బిచ్చి తాత్కాలికంగా ఊరడించటం నిరర్ధకం.
‘యిప్పుడేం చేస్తావ్?’ అడిగాను.
‘పనులేవీ దొరకకున్నాయమ్మా. ఎండకాలం వస్తుందిగ...యాడికైనా పో...’ ఆగిపోయింది.
వలసలు కొత్తేంకాదు.
కనీసం ‘తనది’ అనుకున్న చోటునైనా వదిలి వెళ్ళకుండా ఏదైనా చెయ్యాలి. ‘‘రేపు ఉదయం నాతోబాటు రా దానమ్మా. దగ్గర్లో మా బంధువుల పండ్ల తోటుంది. అక్కడ నీకు పనుంటుంది. వేరే ఎక్కడికీ వెళ్లఖ్ఖర్లేదు’’ అన్నాను.
ఎప్పుడూ ఎవర్నీ సహాయం అడిగే అవసరం రాలేదు, దానమ్మకోసం ఆ మాత్రం చేయాలన్పిచ్చింది.
జీవిత ప్రవాహం అంటే అదేగా...ఒకరికి ఒకరు అన్నట్టు. ‘నేలపై నుంచి ఆమె చూపు మరలింది.’
  Biblography  By Durgesh...
--
రచయిత్రి చిరునామా:
టి.రెహతాజ్ బేగం,
డాటరాఫ్ టి.దాదాపీర్,
ఇం.నెం.2-627, పోస్టల్ కాలనీ,
ఆపోజిట్ ఆర్ట్స్ కాలేజ్,
ఆదోని- 518 302 (కర్నూలు జిల్లా)